రక్షకా నా వందనాలు శ్రీ రక్షకా నా వందనాలు
ధరకు రాకముందె భక్త పరుల కెరుకయైనావు
ముందు జరుగు నీ చరిత్ర ముందె వ్రాసి పెట్టినావు
జరిగినపుడు చూచి ప్రవచనము ప్రజలు నమ్మినారు
నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు
మొట్టమొదట సైతాను మూలమూడ గొట్టినావు
పాపములు పాపముల ఫలితములు గెలిచినావు
నీవె దిక్కు నరులకంచు నీతిబోధ చేసినావు
చిక్కప్రశ్న లాలకించి చిక్కుల విడదీసినావు
ఆకలిగలవారలకు అప్పముల్ కావించినావు
ఆపదలో నున్నవారి ఆపద తప్పించినావు
జబ్బుచేత బాధనొందు జనుని జూడ జాలి నీకు
రోగులను ప్రభావముచే బాగుచేసి పంపినావు
మందు వాడకుండ జబ్బు మాన్పివేయగలవు తండ్రి
వచ్చిన వారందరికి స్వస్థత దయచేయుదువు
అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవు
నమ్మలేని వారడిగిన నమ్మిక గలిగింప గలవు
నమ్మగల్గు వారి జబ్బు నయముచేసి పంపగలవు
రోగిలోని దయ్యములను సాగదరిమి వేసినావు
దయ్యము పట్టినవారి దయ్యము దరిమినావు
బ్రతుకు చాలించుకొన్న మృతులను బ్రతికించినావు
పాపులు సుంకరులు ఉన్న పంక్తిలో భుజియించినావు
మరల నీవు రాకముందు గురుతులుండునన్నావు
చంపుచున్న శత్రువులను చంపక క్షమించినావు
రాక వెన్క అధికమైన శ్రమలు వచ్చునన్నావు
క్రూరులు చంపంగ నా కొరకు మరణమొందినావు
పాపములు పరిహరించు ప్రాణ రక్తమిచ్చినావు
పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు
వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించివేసినావు
శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించివేసినావు
మరణ మొంది మరణ భీతి మరలకుండ జేసినావు
మరణమున్ జయించి లేచి - తిరిగి బోధ జేసినావు
నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకొన్నావు
సృష్టికి బోధించుడని శిష్యులకు చెప్పినావు
నమ్మి స్నానమొంద రక్షణంబు గల్గునన్నావు
దీవించి శిష్యులను దేవలోక మేగినావు
నరకము తప్పించి మోక్షపురము సిద్ధపరచినావు .
మహిమగల బ్రతుకునకు మాదిరిగా నడచినావు
దేవుడవని నీ చరిత్రలో వివరము చూపినావు
త్వరగ వచ్చి సభను మోక్ష పురము కొంచు పోయెదవు
నేను చేయలేనివన్ని నీవె చేసి పెట్టినావు
యేసుక్రీస్తు ప్రభువ నిన్ను యేమని స్తుతింపగలను
బైబిలులో నిన్ను నీవు బయలు పర్చుకొన్నావు
భూమి చుట్టు సంచరించు బోధకులను పంపినావు
సర్వ దేశాలయందు సంఘము స్థాపించినావు
అందరకు తీర్పు రాక ముందే బోధ చేసినావు
పెండ్లి విందు నందు వధువు పీఠము నీ చెంతనుండు
ఏడేండ్ల శ్రమలయందు ఎందరినో త్రిప్పెదవు
హర్మగెద్దోను యుద్ధ మందు ధ్వజము నెత్తెదవు
నాయకులను వేసెదవు నరకమందు తక్షణంబు
సాతానును చెర సాలలో వేసెదవు
వసుధ మీద వెయ్యి సంవత్సరంబు లేలెదవు
కోట్ల కొలది ప్రజలను సమకూర్చి రక్షించెదవు
వెయ్యి యేండ్లు నీ సువార్త విన్నవారి కుండు తీర్పు
పడవేతువు సైతానున్ కడకు నగ్ని గుండమందు
కడవరి తీర్పుండు నంత్య కాలమందు మృతులకెల్ల
నీకును నీ సంఘమునకు నిత్యమును జయము జయము